- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే భూ సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సర్వే అధికారులతో భూ రీసర్వే, 22ఏ వివాదాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ.. సర్వే పూర్తయిన తర్వాత భూ యజమానులకు ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామాల్లో తప్పనిసరిగా దండోరా (చాటింపు) వేయించాలని, కలెక్టర్లు స్వయంగా ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
వారం రోజుల్లో మరో 400 రోవర్లు..
రాష్ట్రంలో ప్రస్తుతం 708 రోవర్లతో సర్వే కొనసాగిస్తుండగా మరో వారం రోజుల్లో అదనంగా 400 రోవర్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలు, రెండు రోవర్లను కేటాయించి పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ఇందులో భాగంగా పాలేరు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నియోజకవర్గ పరిధిలోని మొత్తం 141 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
రీసర్వే నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) జారీ చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన పద్ధతులు అనుసరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్రస్థాయి అధికారుల అనుభవాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని త్వరలోనే ఎస్ఓపీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.
నల్గొండ, ఖమ్మం కలెక్టర్లకు మంత్రి ప్రశంసలు
రీసర్వే అమలు తీరుపై ఇప్పటికే 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో కలెక్టర్లు, ఆర్డీఓలు, మండల స్థాయి రెవెన్యూ అధికారులతో 5 నుంచి 6 గంటల పాటు సుదీర్ఘ సమీక్షలు నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇటీవల సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో సమావేశమై సర్వే పూర్తయిన గ్రామాలు, నోటీసులు జారీ చేసిన ప్రాంతాల్లో విస్తీర్ణంలో తేడాలు, ప్రభుత్వ భూముల రక్షణ వంటి అంశాలను సమీక్షించామన్నారు.
నిజామాబాద్ సర్వే తీరుపై తీవ్ర అసంతృప్తి
నిజామాబాద్ జిల్లాలో నడుస్తున్న సర్వేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణమే పనితీరును మార్చుకొని సర్వే ప్రక్రియను స్పీడప్చేయాలని మంత్రి హెచ్చరించారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న 22ఏ రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అర్హులైన పేదలకు త్వరితగతిన లబ్ధి చేకూర్చాలని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బుధవారం సెక్రటెరియెట్ నుంచి హౌసింగ్ అధికారులు, పీడీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, హనుమకొండ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను తక్షణమే గుర్తించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. డబుల్ ఇండ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
